18, జనవరి 2017, బుధవారం

తిక్కన - పోతన





ప్రాచీన కవుల పద్యాలలొ సంవదించే పద్యాలు కొన్ని పొతన గారి భాగవతంలొ అక్క డక్కడ గోచరిస్తాయని ఒక ఆక్షేపణ ఉంది. అది వాస్తవంగా అలోచిస్తే పొతన్నకు ఉత్కర్షే కాని అపకర్ష ఏ మాత్రమూ కాదు. అటువంటి విధంగా సంవదించే పద్యాలు పూర్వ కవుల పద్యాలతో సరిసమానంగానూ, కొన్నిచోట్ల పూర్వకవి పద్యాలను మెరుగులు దిద్దెవిగానూ ఉన్నాయి.
సంధి కార్యంకోసం రాయబారియై పాండవుల పంపున హస్తినాపురానికి విచ్చేసిన శ్రీకృష్ణుడిని పౌరకాంతలు సౌధాగ్రాలమీద నుంచి సందర్శించే సందర్భంలొ తిక్కనసొమయాజి ఈ పద్యం వ్రాసారు.
ప్రాణంబుతోఁ గూడ రక్కసి చన్నుల పాలు ద్రావిన ప్రౌఢ బాలుడితడె!
వ్రేల్మిడి చాణూరు విరిచి లోకముల మెచ్చించిన యా జగజ్జెట్టి యితడె!
దుర్వృత్తుఁడగు కంసుఁ దునిమి యాతని తండ్రిఁ బట్టంబు గట్టిన ప్రభువితండె!
సత్యభామకుఁ బారిజాతంబుపైఁ గలకోర్కి దీర్చిన రసికుం డితండె!
వెన్నలను గోపికా చిత్తవృత్తములును, నరసి మృచ్చిల నేర్చిన హరి యితండె!
శృతి శిరోభాగములఁ దన సుభగచరణ సరసి, జామోదమును గూర్చు చతురుఁడీతఁడె
తిక్కనగారి ఈ సీసానికి సమానంగా పొతన్నగారు మరొక సీసపద్యం వ్రాసారు. కంసుని ఆహ్వానం అందుకొని మథురానగరానికి విజయం చేసిన శ్రీకృష్ణ్ణుని అక్కడి స్త్రీలు మేడలమీద నుంచి చూస్తున్న దృశ్యమిది.
వీఁడటే! రక్కసి విగతజీవగఁజన్నుఁ బాలు ద్రావిన మేటి బాలకుండు
వీఁడటే నందుని వెలఁదికి జగమెల్ల ముఖమందుఁ జూపిన ముద్దులాఁడు
వీఁడటే మందలో వెన్నలు దొంగలి దర్పించి మెక్కిన దాఁపరీఁడు
వీఁడటే! యలయించి వ్రేతల మానంబు సూరలాడిన లోక సుందరుండు
వీఁడు లేకున్న పుర మటవీస్థలంబు, వీని బొందని జన్మంబు విగత ఫలము
వీనిఁ బలుకని వచనంబు విహగ రుతము, వీనిఁ జూడని చూడ్కులు వృథలు వృథలు.
ఇరువురు మహాకవులు సీసాలూ రసోల్లితాలే. హస్తినాపుర కాంతలకు కనిపిస్తున్నవాడు ప్రౌఢ వయస్కుడైన శ్రీకృష్ణుడు. మధురానగర నారీమణులకు కనువిందు చేస్తున్నవాడు నవయౌవనంతో నవనవలాడే గొపాలకృష్ణుడు. అందువల్ల పోతన్నగారి పద్యం కొంచెం శృంగారం వైపు మొగ్గింది. తిక్కన గారి పద్యంలో అర్థగాంభీర్యం, భావవైవిధ్యం అతిశయంగా ఉన్నమాట వాస్తవం. అయితే పోతన్నగారి పద్యంలో పాదాల మొదట “వీఁడటే వీఁడటే” అన్న దీర్ఘాంత పదాలు పౌరకాంతల ఆశ్చర్యాన్ని, ఆనందాన్నీ, ఉత్కంఠనూ, ఉత్సాహాన్ని వెల్లడిస్తున్నాయి. మునివేళ్ళపై నిలిచి, చేతులు చాచి, వేలు పెట్టి చూపిస్తున్నట్లు ఈ పద్యం లోని ఎత్తుగడలు స్ఫురింపజేస్తున్నాయి. ఈ పద్యాన్ని తిక్కన గారు తిలకిస్తే “నీ పద్యం అభినయయోగ్యమై దర్శనకుతూహలాన్ని అతిశయింపజేస్తున్నది తమ్ముడూ” అంటూ పొతన్నను అభినందించి ఆలింగనం చేసుకుంటాడేమో!
పోతన భాగవతం..వ్యాఖ్యానం : కరుణ శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి.
సేకరణ : పొన్నాడ లక్ష్మి.

కామెంట్‌లు లేవు:

దార అప్పలనారాయణ - కుమ్మరి మాస్టారు - బుర్రకధ కళాకారుడు

  charcoal pencil sketch (Facebook goup  The Golden Heritage of Vizianagaram గ్రూపు లో లభించిన ఫోటో ఆధారంగా చిత్రీకరించిన చిత్రం) వివరాలు వి...